భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. కథువా జిల్లాలో భారీ వర్షాల కారణంగా బాని ప్రాంతంలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరోచోట కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు చనిపోయారు. వారి మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి.
ఇల్లు కూలిన విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 3 మృతదేహాలు వెలికితీయగా మరో రెండింటి కోసం వెతుకుతున్నారు. ఇక కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
చోట కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ బాలుడు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కుండపోత వర్షాల కారణంగా శ్రీనగర్ - జమ్మూ నేషనల్ హైవేను తాత్కాలికంగా మూసివేశారు. కథువా జిల్లాలోని చద్వాల్ వంతెన దెబ్బతినడంతో జమ్మూ - పఠాన్‌కోఠ్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్రిడ్జిలు, కల్వర్టులు, రోడ్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వైష్ణోదేవి ఆలయ యాత్రకు బేస్ క్యాంప్‌గా ఉన్న కత్రాలో 24 గంటల్లోనే 315 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడంతో వరదలు తీవ్రరూపం దాల్చాయి. తావి నది నీటిమట్టం సైతం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో అధికారులు పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.