ఆరేళ్ల బాలుడిపై..గంజాయి మత్తులో దారుణం
గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఆరేళ్ల బాలుడిపై లైంగికంగా దాడి చేసి చిత్రహింసకు గురిచేశాడు. ఈ దారుణమైన ఘటన పొన్నూరులో జరిగింది. 6 ఏళ్ల బాబుపై ఓ యువకుడు ఇంతటి దారుణానికి పాల్పడటంతో ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధిత బాలుడు స్థానికంగా ఉన్న ఓ ప్రవేట్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం స్కూల్ పూర్తికాగానే ఇంటికి వచ్చేశాడు. అనంతరం తన ఇంటి ఆవరణలోనే తన తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఈలోగా అటుగా వచ్చిన 20 ఏళ్ల నాగిశెట్టి పవన్ సంజయ్ గంజాయి మత్తులో బాలుడిని ఓ రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ పై బాలుడిపై లైంగిక దాడి చేశాడు. బాలుడు పెద్దగా అరవడంతో చుట్టుపక్కలవాళ్లు రూమ్ దగ్గరకు చేరుకుని యువకుడికి దేహశుద్ధి చేశారు. బాలుడిని పొన్నూరు గవర్నమెంట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. జరిగిన సంఘటనపై బాధిత కుటుంబసభ్యులు అర్బన్ పోలీసులకు ఫార్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద ఆ యువకుడిపై కేసు ఫైల్ చేశారు.