బాత్రూంలో యువజంట మృతి.. ఏం జరిగిందంటే..?

Update: 2023-06-13 16:11 GMT

వారిద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి జీవించాలనుకుని.. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. కానీ అనుకోని విధంగా విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన కర్నాటకలో జరిగింది. చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్, బెళగావి జిల్లాకు చెందిన సుధారాణి నందిహిల్స్ సమీపంలోని ఓ రిస్టార్ట్లో పనిచేస్తున్నారు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.పెళ్లికి ముందే సహజీవనంలో ఉన్నారు.

ఈ క్రమంలో శనివారం రాత్రి చంద్రశేఖర్, సుధారాణి జంటగా స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లారు. వేడినీళ్ల కోసం గీజర్ ఉపయోగించగా అందులోంచి విషయవాయువులు వెలువడినట్లు తెలుస్తోంది. డోర్లన్నీ మూసివుండడంతో గీజర్ నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ బాత్రూంలో నిండిపోయింది. దీంతో ఈ వాయువులు పీల్చి యువజంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే మరుసటిరోజు కూడా వారి ఇంటి డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఇంటి ఓనర్కు అనుమానం వచ్చి.. తలుపుతట్టినా ఎవరూ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా బాత్రూంలో యువజంట మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువజంట ప్రమాదవశాత్తు మృతిచెందారా లేక మరేదైనా కారణముందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరికొద్దిరోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన జంట ఇలా పాడెఎక్కడం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    

Similar News