కాదేదీ నకిలీకి అనర్హం. చివరికి జడ్జీల్లోనూ నకీలు తయారయ్యారు. ‘‘నేను జడ్జీని. నాకు పైసలిస్తే తీర్పు నీకు అనుకులంగా ఇచ్చేస్తా.. ఇది నా ఐడీ కార్డు. ఇవి నా ఫోన్ నంబర్లు’’ అని మరీ పబ్లిగ్గా వెబ్‌సైట్ కూడా పెట్టి దందాకు దిగాడు ఓ ఫేకూ న్యాయమూర్తి. ఓ బాధితుడు గుడ్డిగా నమ్మి రూ. 10 లక్షలు సమర్పించుకుని లబోదిబోమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడగా బండారం బయటపడింది. నకిలీ జడ్జి పేరుమోసిన కేటుగాడు అని, అతణ్ని ఎలా నమ్మావని పోలీసులు బాధితుడికి కూడా చిన్నకోటింగ్ వేసుకున్నారు. మల్కాజ్‌గిరి, ఉప్పల్ పోలీసులు ఫేక్ జడ్జికి, అతని గన్‌మెన్‌కు అరదండాలు వేసి అసలు జడ్జి ముందు నిలబెట్టి జైల్లోకి నెట్టారు. వారి నుంచి తుపాకీ, కారు నగదు, నకిలీ విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ మోసాలు..
సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ పాత నేరగాడు. దొంగతనాల కేసులో చాలాసార్లు అరెస్టయ్యాడు. కాస్త ‘గౌరవనీయమైన వృత్తి’ పేరుతో దందా చేస్తే జనానికి అనుమానాలు రావని కొత్త ఎత్తు వేశాడు. తను జడ్జి అని చెప్పుకుంటూ నకిలీ వెబ్‌సైట్ పెట్టాడు. సైన్యంలో పనిచేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని గన్‌మెన్‌గా నియమించుకుని అసలైన జడ్జిగా డాబు ప్రదర్శించాడు. భూతగాదాలు పరిష్కారిస్తానని వెబ్‌సైట్ ద్వారా ప్రచారం చేసుకున్నాడు. అచ్చం జడ్జీలా ఐడీ కార్డు చూపూ జనానికి వల వేసి లక్షలు వసూలు చేశాడు. ఖమ్మం పోలీసులు అతని బండారం కనిపెట్టి ఇటీవలే అరెస్ట్ చేయగా జైలు నుంచి విడుదలైన హైదరాబాద్ చేరుకున్నాడు. ఐడీ కార్డులో అడిషనల్ సివిల్ జడ్జి అని పెట్టుకుని మళ్లీ దందా చేశాడు. అతని వల్లో పడిన సోమిరెడ్డి అనే వ్యక్తి భూతగాదా కేసులో తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని రూ.10 లక్షలు సమర్పించుకున్నాడు. కేసు అజాపజా లేకపోవడంతో సోమిరెడ్డి ఆరా తీయగా నరేందర్ గట్టురట్టయింది. పోలీసులు ఫేక్ జడ్జితోపాటు, అని గమ్‌మెన్ అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.