బొట్టుపెట్టుకుందని స్టూడెంట్ను కొట్టిన టీచర్.. అవమానం భరించలేక..

Update: 2023-07-12 08:14 GMT

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. టీచర్ చేసిన అవమానం భరించలేక టెన్త్ క్లాస్ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. బొట్టు పెట్టుకుని పాఠశాలకు రావడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాల ఆవరణలోనే అందరి ముందు సదరు బాలికను చితకబాదాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు సదరు టీచర్ను అదుపులోకి తీసుకున్నారు.

ధన్ బాద్లోని తెతూల్మారీ ప్రాంతంలోని సెయింట్ జెవియర్ స్కూల్‌లో ఉషా కుమారీ(16) అనే విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. సోమవారం సదరు బాలిక నుదుటిపై బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. అది చూసిన టీచర్ సింధు తీవ్ర ఆగ్రహానికి లోనైంది. బొట్టు ఎందుకు పెట్టుకున్నామని అందరి ముందు నిలదీసింది. ఉపాధ్యాయుడి ప్రశ్నకు విద్యార్థిని ఎదురు సమాధానం చెప్పడంతో సదరు టీచర్ కోపానికి నషాళానికంటింది. అందరూ చూస్తుండగానే విద్యార్థినిని చితకబాదింది. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్కూల్ యూనిఫాంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.

బాలిక ఆత్మహత్య ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. మృతుడి బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని తీసుకుని పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News