తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడి, అమ్మానాన్నలు కాదన్నారనే కారణంతో తమ నిండు ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు యువతీ యువకులు. కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ మైనర్ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. వీరిద్దరి కులాలు వేరుకావడంతో పెద్దలు అంగీకరించరేమోనన్న అనుమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ జంట ఇంట్లోనే ఒకేతాడుకు ఉరివేసుకుని చనిపోయారు. దుబ్బాక మండలం లచ్చపేటలో ఈ దారుణం జరిగింది. స్థానికంగా సంచలనంగా మారింది.
లచ్చపేటలో ఉంటున్న నేహా దుబ్బాకలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో భగీరథ్ అనే యువకుడు సెకండియర్ ఇంటర్ చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా లవ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం భగీరథ్ ఇంట్లోనే నేహా, భగీరథ్ ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ పిల్లలు ఇలా విగతజీవులుగా ఇంట్లో కనిపించడంతో భగీరథ్ పేరెంట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. యువతీ యువకుల మృతదేహాలను దుబ్బాక ప్రాంతీయ హాస్పిటల్కు తరలించారు.ఈ మైనర్ ప్రేమ జంట సూసైడ్ చేసుకున్న చోటనే ఓ లేఖ లభించిందని తెలుస్తోంది. తమ కులాలు వేరుకావడం వల్ల పెద్దలు తమ ప్రేమను ఎక్కడ అంగీకరించరేమో అన్న అనుమానంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.