రూ. 5 కోట్ల చోరీ.. 10 వేలకు కక్కుర్తిపడి దొరికిపోయిన బిత్తిరోడు

Update: 2023-08-01 06:36 GMT

ఎంత జిత్తుల మారి దొంగలైనా వారి బలహీనతలు వారికి ఉంటాయి. కొందరికి తిండి బలహీనత, కొందరికి అమ్మాయిల బలహీనత. కొందరికి షరా మామూలుగా డబ్బు బలహీనత. రూ. 5.5 కోట్ల సొమ్మును చోరీ చేసిన ముఠాలోని సభ్యుడు కేవలం రూ. 10 వేల జీతం కోసం ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. దోచుకున్న సొమ్మూ పాయె, కష్టపడి సంపాదించిన జీతమూ పాయె అని జైల్లో నెత్తీనోరూ కొట్టుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.,. గత నెల సికింద్రాబాద్‌ సింధీ కాలనీలోని వ్యాపారి విజయ్ కుమార్ గోయల్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. అతని ఇంట్లో పనిచేసే శంకర్‌మాన్ సింగ్ అనే నేపాలీ తన మిత్రులైన మిగతా నేపాలీలతో కలసి రూ. 5.5 కోట్ల చోరీ చేశాడు. విజయ్ గోయల్ పనిమీద వేరే ఊరు వెళ్తున్న విషయాన్ని శంకర్ తన ముఠాకు చేరవేసి ప్లాన్ సక్సెస్ చేశారు. ఆ ఆపరేషన్‌కు భరత్ బిస్తా (25) సూత్రధారి. అతడు పుణేలో ఓ హోటల్లో పనిచేసేవాడు. శంకర్ పిలుపుతో సికింద్రాబాద్ వచ్చి చోరీకి పెద్ద స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారు. తర్వాత సొమ్మును వాటాలు వేసుకుని ఎవరిదారిని వాళ్లు వెళ్లిపోయారు. హైదరాబాద్ పోలీసులు అందరి ఫోన్ నంబర్లపై నిఘా పెట్టారు. కొందరు నేపాల్ సరిహద్దులో అడ్డంగా బుక్కయ్యారు.

భరత్ పని చేసిన పుణేలోని హోటల్ అతనికి నెల నెలా రూ. 10 వేల జీతాన్ని బ్యాంకు ఖాతాలో జమచేస్తుంటుంది. భరత్ తనపై నిఘా ఉన్న సంగతి మరిచిపోయి, జీతం ఎప్పుడు వేస్తారని హోటల్ యజమానికి ఫోన్ చేశాడు. అతని ఫోన్‌పై నిఘా పెట్టిన పోలీసులు ఆచూకీ కనిపెట్టారు. ఢిల్లో ఉన్న భరత్ నేపాల్‌కు పారిపోతుండగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతణ్ని సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. ముఠాలో మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారని, వారందరూ భరత్ చెప్పినట్లు చేసి చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నేపాల్‌లోని తిక్కాపూర్‌కు చెందిన భరత్ ఆదేశంలోనూ చోరీ చేసి జైలుకు వెళ్లొచ్చాడు.

Tags:    

Similar News