లండన్ నుంచి హైదరాబాద్‌లో విషప్రయోగం... ఒకరి మృతి
నేరగాళ్లు తెలివికే తెలివి మీరి పోతున్నారు. తనతో విడిపోయిన భార్య కుటుంబాన్ని అంతమొందించడానికి ఓ ఎన్నారై లండన్ నుంచి విషప్రయోగం చేశాడు. అత్త చనిపోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యాకు. క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించే ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. మియాపూర్‌కు చెందిన హన్మంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీష 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం.అజిత్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. అజిత్‌కు అంతకుముందే పెళ్లయి తొలి భార్యతో విడిపోయాడు. శిరీష, అజిత్ లండన్‌లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉన్నారు. వారికి ఒక కూతురు. విభేదాల వల్ల విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. అజిత్ తనను వేధిస్తున్నాడని ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో అజిత్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
ఇంజెక్షన్‌తో పని కాలేదు..
కొన్ని నెలల కిందట శిరీష తన తమ్ముడి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చింది. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్‌లో తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపడానికి అజిత్ పథకం పన్నాడు. లండన్‌లో తన దగ్గర పనిచేసే వినోద్‌కుమార్‌తో కలసి స్కెచ్ వేశాడు. హైదరాబాద్‌లోని వారి మిత్రులైన భవానీశంకర్, అశోక్, గోపినాథ్, పూర్ణేందర్‌రావు చేతులు కలిపారు. శిరీష కుటుంబం నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కొడుకు రమేష్‌కు డబ్బులిచ్చి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించసాగారు. ఈ ఏడాది జూన్ నిందితుల్లో ముగ్గురు పాయిజన్ ఇంజక్షన్లతో శిరీష ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులకు గుచ్చడానికి వెళ్లగా ప్రయత్నం ఫలించలేదు. దీంతో మరో మార్గం అనుసరించారు.
మసాలా ప్యాకెట్లు
ఓ నిందితుడు డెలివరీ బాయ్‌గా మారి విషం కలిపిన కారం, పసుపు, ఇతర మసాల పొడుల ప్యాకెట్లను శాంపిల్ ప్యాకెట్లని శిరీష ఇంట్లో ఇచ్చాడు. విషయం తెలియని శిరీష కుటుంబం వాటిని వాడింది. శిరీష సహా ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆమె తల్లి జులై 5న చనిపోయింది. శిరీష, తండ్రి, తమ్ముడు, మరదలు, మరో మహిళ కూడా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కాళ్లు, చేతుల్లో స్పర్శ లేకపోవడంతో రక్తపరీక్షలు చేయించుకోగా విష ప్రయోగం జరిగినట్లు తేలింది. శిరీష గురువారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. గోకుల్ ఫ్లాట్స్‌లోని సీసీకెమెరాలు పరీశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. మొదట వాచ్‌మన్ కొడుకును తమదైన శైలిలో విచారించగా అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాటులో ఉంటున్న శిరీష బంధువు పూర్ణేందర్‌రావు పేరు బయటపెట్టాడు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు అజిత్‌కుమార్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు బ్రిటన్ పోలీసులకు సమాచారం పంపారు.