విద్యార్థినిని 10 సెకన్లే తాకాడని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

Update: 2023-07-15 07:36 GMT

ఇటలీలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఓ విద్యార్థినిపై ఆమె కేర్ టేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. నిందితుడు కేవలం 10 సెకన్ల కంటే తక్కువ సమయమే ఆ విద్యార్థిని తాకడని చెబుతూ..అతడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఈ తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రోమ్‌కు చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. ఈ స్కూల్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న 66 ఏళ్ల ఆంటోనియో అవోలా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె గతేడాది ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసింది. ఆ రోజు తాను స్నేహితురాలితో కలిసి స్కూల్లో మెట్లెక్కుతుండగా.. కేర్‌టేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు తెలిపింది.

తన వెనుక భాగంపై చేతులతో తడిమి.. తన లోదుస్తులను కిందకు లాగేందుకు అతడు ప్రయత్నించినట్లు వివరించింది. ఆ తర్వాత తనను పైకెత్తాడని.. తాను భయపడిపోవడంతో జోక్‌ చేశానంటూ కేర్‌టేకర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆంటోనియోపై కేసు నమోదు చేశారు. దీనిపై స్థానిక కోర్టులో విచారణ జరగ్గా.. ఆ విద్యార్థినిని తాను తాకడం నిజమేనని అతడు అంగీకరించాడు. అయితే తాను సరదాగానే అలా చేశానని కోర్టుకు తెలిపాడు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘‘కామవాంఛతో తాను ఈ పనిచేయలేదని, కేవలం సరదాగా చేసినట్లు నిందితుడు చెప్పిన వాదనను మేం అంగీకరిస్తున్నాం. బాలికను అతడు కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకాడు. కాబట్టి దీన్ని నేరంగా పరిగణించడం అనాలోచితమే అవుతుంది’’అని వ్యాఖ్యానించింది. ఇక ఈ తీర్పుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News