రీల్స్ చేస్తోందని చెల్లిని కొట్టి చంపిన అన్న
సోషల్ మీడియా ఎఫెక్ట్ ఈరోజుల్లో మామూలుగా లేదు. దాదాపు అందరూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఫోన్ చేతిలో పెట్టుకునే తిరుగుతున్నారు. కొందరైతే అసలు పనులు మానేసి మరీ సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఇదే చిరాకు వచ్చింది కాబోలు ఓ అన్నయ్యకు....ఏకంగా చెల్లెలని రోకలిబండతో బాది మరీ చంపేశాడు.
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని రాజీవ్ నగర్ లో జరిగిందీ ఘటన. అజ్మీరా సింధు, హరిలాల్ అన్నాచెల్లెళ్ళు. మహాబూబాబాద్ లో ఏఎన్ఎంలో అప్రెంటీస్ చేస్తున్న సింధు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేది. ఇది హరిలాల్ కు నచ్చేది కాదు. ఈ విషయంలో ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు. సోమవారం రాత్రి కూడా దీని గురించే గొడవ పడ్డారు. అప్పుడు ఆవేశంలో హరిలాల్ రోకలిబండ తీసుకుని సింధు తలమీద కొట్టాడు. ఇందులో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పగా వరంగల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ సింధు మధ్య దారిలోనే చనిపోయింది.
సింధు చనిపోయాక కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. ఏంటని అడగ్గా రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంక్వైరీలో అసలు విషయం బయటపడింది. అయితే హరిలాల్ అప్పటికే పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.