హిందూ దేవతలపై "అభ్యంతరకర వీడియో" .. వ్యక్తి అరెస్ట్

Update: 2023-08-06 03:55 GMT

హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సాజిద్... హ‌ర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా నిట్ ఫరీదాబాద్ ప్రాంతంలో గత మూడేళ్లుగా సెలూన్ నడుపుతున్నాడు. తాజాగా ఫేస్ బుక్ లో హిందూ దేవతలపై చిత్రీకరించిన ఓ అభ్యంతరకరమైన వీడియోను షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ అవడంతో.. పోలీసుల దృష్టికి చేరింది. దీంతో మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టాడనే ఆరోపణపై అతడిని హర్యానా పోలీసులు అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు.

మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం, సామాజిక సామరస్యానికి భంగం కలిగించడం, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయని పోలీసు అధికార ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు. ఆ వీడియోలో హిందూ దేవుళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించారని పోలీసులు తెలిపారు. నిందితుడు సాజిద్ తో పాటు మరో ఇద్దరిపై సరన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసు రిమాండ్ కు తీసుకెళ్తామని, మిగతా ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో సాజిద్ ను ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారని, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించే ఎలాంటి ప్రకటనల గురించి అయినా పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News