TSPSC : పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్..

Update: 2023-07-12 06:11 GMT

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టుచేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వి.నరేష్‌, ఏఈ పూల రమేష్‌ సహాయంతో ఏఈ పరీక్షలో కాపీయింగ్‌కి పాల్పడినట్లు సిట్ గుర్తించింది. నరేష్‌ తన పరిచయాల ద్వారా ఏఈ ప్రశ్నపత్రాలు అమ్మకంలో రమేష్‌కు సహకరించాడు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన వి.నవీన్‌, జి. చంటి, సూర్యాపేటకు చెందిన సుమన్‌ ఏఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించడంతో వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రశ్నాపత్నాల లీకేజీ కేసులో సిట్ సోమవారం 18 మందిని అరెస్ట్ చేసింది. మంగళవారం అదుపులోకి తీసుకున్న ముగ్గురితో కలుపుకొని ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 78కి చేరింది. ఈ కేసులో మరో 70 మంది వరకు అరెస్ట్ అయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కేవలం ఏఈ క్వశ్చన్ పేపర్ అమ్మిన నిందితుల్లో ఒకరు రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే పరీక్షా పత్రం కొనుగోలు చేసిన వారిలో ఒకర్దిదరు మినహా మిగతావారంతా నిరుద్యోగులే. వారంతా తల్లిదండ్రులపై ఆధారపడిన వారే కావడంతో పేపర్ కొనేందుకు తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకుని ఉంటారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుల పేరెంట్స్ ను కేసులో సాక్షులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు లీకేజీ కేసు గురించి ముందే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వనందున వారి పేర్లను కేసులో చేర్చాలనుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News