ఒడిశా రైళ్ల కేసులో ముగ్గురి అరెస్ట్.. వాళ్లకు ముందే తెలుసు!
వందల మంది ప్రాణాలను బలితీసుకున్న ఒడిశా రైలు ప్రమాదం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్(సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజీనీర్ అమీర్ ఖాన్ , టెక్నీషియన్ పప్పు కుమార్‌లను అదుపులోకి తీసుకుంది. వీరిపై హత్య కిందికి రాని మానవ హననం, సాక్ష్యాధారాల విధ్వంసం కేసులు నమోదు చేసింది. వీరి నిర్లక్ష్యం వల్లే రెండు రైళ్లు, ఒక గూడ్సు ఢీకొట్టాయని తెలిపింది. తమ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘోరం జరుగుతుందని వీరికి ముందే తెలుసని దర్యాప్తు నివేదికలో పేర్కొంది.
సీబీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం వెనక కుట్ర, మానవ తప్పిదం, సాంకేతిక లోపం లేవు. నిందితుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. సరైన సిగ్నల్ తనిఖీ ప్రక్రియను పాటించలేదు. రైల్వే ట్రాకులను పారలల్‌గా అసాధాణ రీతిలో కనెక్ట్ చేశారు. గత ఏడాది మే 16న ఖరగ్‌పూర్ డివిజన్‌లోని బ్యాంక్‌నయాబజార్ స్టేషన్ లోనూ సమన్వయ లోపం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ సంఘటన నుంచి గుణపాఠం నేర్చుని ఉంటే ఒడిశా సంఘటన జరిగేది కాదని నివేదికలో పేర్కొన్నారు. గత నెల 2వ తేదీన బాలాసోర్ దగ్గర జరిగిన ప్రమాదంలో 293 మంది చనిపోగా వేయిమందికిపైగా గాయపడడం తెలిసిందే.