టోల్ ఫీజు కట్టమన్నందుకు జుట్టు పట్టుకుని కొట్టింది

Update: 2023-07-17 12:42 GMT

ఉత్తర్ ప్రదేశ్లో ఓ మహిళ రెచ్చిపోయింది. విధి నిర్వాహణలో ఉన్న టోల్ గేట్ సిబ్బందిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో సదరు మహిళా ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఉత్తర్ ప్రదేశ్లోని నేషనల్ హైవే 91పైనున్న లూహర్లీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న ఓ కారును టోల్ గేట్ సిబ్బంది ఫీజు కట్టేందుకు ఆపారు. అయితే అందులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు ఆమె కుటుంబసభ్యులు టోల్ ఫీజు కట్టేందుకు నిరాకరించారు. దీంతో విధి నిర్వాహణలో ఉన్న మహిళా ఉద్యోగి కారు ముందుకెళ్లేందుకు అనుమతించలేదు. టోల్ ఫీజు కడితేనే బారియర్ ఎత్తుతానని తెగేసి చెప్పడంతో కారులో ఉన్న మహిళ ఆగ్రహానికి గురైంది. సదరు మహిళా ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది.

టోల్ గేట్ సిబ్బంది ఫీజు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో సదరు మహిళ కోపంతో ఊగిపోయింది. బూతులు తిడుతూ టోల్ బూత్ లోకి వచ్చి ఉద్యోగినిపై దాడికి దిగింది. ఆమె జుట్టు పట్టుకుని బారియర్ ఎత్తాలని వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగిని విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కుర్చీలో ఉన్న ఉద్యోగినిని కింద పడేసి దాడి చేసింది. టోల్ బూత్లోని ఇతర సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా సదరు మహిళ వెనక్కి తగ్గలేదు. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

ఉద్యోగినిపై దాడి అనంతరం టోల్ బూత్ బయటకు వచ్చిన సదరు మహిళ బలవంతంగా బారియర్ను తొలగించింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తాన్ని అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. టోల్ గేట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాని పట్టుకునే పనిలో పడ్డారు.

Tags:    

Similar News