కొందరు వలంటీర్లు చేస్తున్న ఘోరాల వల్ల మొత్తం వలంటీర్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. వలంటీర్ల వ్యవస్థపై తీవ్ర వాదవివాదాల నేపథ్యంలో సైతం ఆగడాలు మితిమీరుతున్నాయి. విశాఖపట్నంలో ఓ వలంటర్ బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశాడు. పెందుర్తి సుజాతనగర్‌కు చెందిన వెంకట్ అనే వలంటీర్ ఆదివారం రాత్రి వరలక్ష్మి అనే వృద్ధురాలు ఇంటికి వెళ్లి ఆమె నిద్రిస్తుండగా ముఖంపై దిండు అదిమిపెట్టి హత్య చేశాడు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగలను ఒలుచుకుని పారిపోయాడు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు. వెంకట్ 95వ వార్డు పురుషోత్తపురంలో వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. వరలక్ష్మి కొడుకు నడిపే దుకాణంలో అతడు పనిచేస్తున్నాడు. అతణ్ని వరలక్ష్మి కుటుంబం సొంత కొడుకులా చూసుకున్నా కృతజ్ఞత లేకుండా బలితీసుకున్నాడని స్థానికులు అంటున్నారు.