వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ చనిపోయారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన పరాగ్ చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. మెదడులో రక్తస్రావం జరగడం ఆయన మృతికి కారణమని డాక్టర్లు చెప్పారు.
అక్టోబర్ 15న పరాగ్ అహ్మదాబాద్లోని తన ఇంటికి సమీపంలో ఉండగా.. కొన్ని వీధికుక్కలు ఆయనపై దాడి చేశాయి. ఆ సమయంలో పరాగ్ కిందపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించగా.. వారం రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆదివారం బ్రెయిన్ హేమరేజ్ కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పరాగ్ సన్నిహితులు చెప్పారు.
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరైన పరాగ్ దేశాయ్.. కంపెనీని ఈ-కామర్స్ రంగంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన పరాగ్.. కంపెనీ సేల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ విభాగాలను ఆయన పర్యవేక్షించేవారు. కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2,000 కోట్లు కాగా.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోంది.