ఒక్క లైక్​ కొడితే రూ.200 .. అరకోటికి పైగా మోసం

Update: 2023-09-26 07:50 GMT

"సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలతో రెచ్చిపోతున్నారు". లింక్ క్లిక్ చేయండి, లైక్ చేయండటూ అమాయకులు జేబులు కొల్లగొడుతున్నారు. ఈజీగా మనీ సంపాదించవచ్చని అమాయకులు వీరి చేతిలో మోసపోతున్నారు. సైబర్‌ నేరాలపై పోలీసులు.. విస్తృత అవగాహన కల్పిస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నప్పటికీ.. మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉందంటే.. సమస్య ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా లైకులు కొడితే డబ్బు సంపాదించవచ్చంటూ ఓ యువతి నుంచి రూ.59 లక్షలు.. దోచేశారు సైబర్‌ మాయాగాళ్లు.

హైదరాబాద్‌ మణికొండకు చెందిన యువతి బీటెక్‌ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సెప్టెంబరు తొలి వారంలో ఆమెను షైలా అనే మహిళ వాట్సాప్ లో సంప్రదించింది. తమ సంస్థ వెబ్ సైట్ ప్రచారం కోసం కొందరిని సంప్రదిస్తున్నామని.. అందులో భాగంగా ఆమెను ఎంపిక చేసుకున్నట్లుగా పేర్కొంది. తాము పంపిన వాటికి లైకులు కొట్టి.. స్క్రీన్ షాట్లు పంపితే.. డబ్బులు ఇస్తామని ఆశ చూపించింది. దీన్ని నమ్మిన సదరు యువతి.. షైలా చెప్పిన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యింది. రోజుకు 23 టాస్కులు పూర్తి చేయాలని.. ఒక్కో టాస్కులో లైకులు కొట్టి స్క్రీన్ షాట్లను గ్రూప్ లో పోస్టు చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పింది. ఇదంతా నమ్మిన యువతి సెప్టెంబరు 5వ తేదీన కొన్ని టాస్కులు పూర్తి చేయగానే 200 చొప్పున మూడు సార్లు కలిపి 600 జమ చేసింది.

ఆ తర్వాత మరో వ్యక్తి బాధితురాలిని ఫోన్ ద్వారా సంప్రదించి.. ఇకపై టాస్కులు ఇవ్వాలంటే ముందస్తుగా డబ్బులు కట్టాలని.. టాస్కులు పూర్తి అయ్యాక కట్టిన డబ్బులతోపాటు మిగిలిన డబ్బులు కూడా ఇస్తామని నమ్మించాడు. ఇలా 4 రోజుల్లో యువతి నుంచి రూ.59.2 లక్షలు జమ చేయించుకున్నారు. ఎన్ని టాస్కులు పూర్తి చేసినా మళ్లీ మళ్లీ డబ్బు పంపాలని కోరుతూ లాభాలు మాత్రం ఇవ్వలేదు. ఎంతకూ డబ్బులు తిరిగి రావటంతో.. చివరకు తాను మోసపోయినట్లుగా గుర్తించింది. అనంతరం ఆ యువతి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags:    

Similar News