Kids Health: ఛాతిలో కఫం పేరుకుపోయిందా?..ఇలా చేస్తే చిటికెలో మాయం
వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగిపోయింది. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేకపోతున్నారు. చలిగాలులకు బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అందులోనూ అనారోగ్య సమస్యలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో పాటు శ్వాసకోశ సమస్యలు ఈ సీజన్ లో అధికంగా వేధిస్తుంటాయి. ఇక చలికాలంలో చాలామందికి ఛాతీలో కఫం పేరుకుపోయి ఇబ్బంది కల్గిస్తుంటుంది. కఫం అనేది లంగ్స్లో తయారయ్యే ఓ పదార్ధం. వాస్తవానికి ఇది ఆరోగ్యానికి మంచిది. ఊపిరితిత్తుల్లో దుమ్ము ధూళి కణాలు పేరుకుపోకుండా ఈ కఫం కాపాడుతుంది. బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ కఫం ఎక్కువగా ఏర్పడితేనే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతులో నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. కఫం పసుపు లేదా ఎరుపు రంగులోకి మారితే మాత్రం అది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. .ఈ క్రమంలో కఫం ఎక్కువగా పేరుకుపోయినప్పుడు ఫుడ్ హ్యాబిట్స్పై దృష్టి పెట్టాలాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో కఫం పేరుకుపోయినప్పుడు కొన్ని రకాల ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చడం ద్వారా తొలగించవచ్చంటున్నారు.
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు కామన్. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. జలుబుతో పాటు, ఛాతీలో కఫం పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే సకాలంలో ట్రీట్మెంట్ అందించకపోతే మాత్రం ఇది మరింత తీవవ్రంగా మారే అవకాశం ఉంది. చిన్నారుల్లో కఫం సమస్యను తగ్గించేందుకు వైద్యులు నెప్లైజర్‌ని ఉపయోగిస్తారు లేదా సిరప్‌లు వంటివి సూచిస్తుంటారు. అయితే వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో ఈ సమస్యకు న్యాచురల్ గానే చెక్ పెట్టొచ్చు. చిన్నారుల్లో కఫం తగ్గించడంలో ఆవ నూనె బెస్ట్ ఛాయిస్. ఆవనూనెతో చిన్నారుల ఛాతీపై మసాజ్ చేస్తే కఫం కరిగిపోతుంది. వెల్లుల్లిని కలిపిన ఆవనూనెను కాస్త వేడి చేసి ఆ తర్వాత ఛాతీపై మసాజ్ చేస్తే ఇట్టే కరిగిపోతుంది. ఇక కఫాన్ని సహజంగా తొలగించడానికి మరో చిట్కా ఏమిటంటే పాలను గోరువెచ్చగా వేడి చేసి అందులో పసుపు కలిపి పిల్లలకు తాగించాలి. ఈ పసుపు పాలు పిల్లల శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ కారణంగా శరీరం నుంచి కఫం సులభంగా కరిగిపోతుంది.
ఛాతీలో పేరుకుపోయిన కఫంను తొలగించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గొంతు, ఛాతీలో పేరుకున్న అదనపు కఫంను సులభంగా బయటకు పంపిస్తాయి. ఉల్లిపాయలను కూడా ఛాతీలో కఫం సమస్యను దూరం చేసేందుకు వినియోగించవచ్చు. ఉల్లిగడ్డలు జ్వరం, గొంతు గరగర సమస్యల్ని ఇట్టే తగ్గించేస్తాయి. ఉల్లిగడ్డలను మెత్తగా పేస్ట్ చేసుకుని దానిని 6 గంటల వరకూ నీళ్లలో నానబెట్టి రోజూ 3 స్పూన్ల నీటిని తాగితే ఛాతీలో కఫం దూరమౌతుంది. ఇక లవంగాలు కూడా కఫం తగ్గించేందుకు బాగా సహాయపడతాయి. ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, సోడియం, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను రక్షిస్తాయి. కొన్ని రకాల సూక్ష్మజీవుల నుండి మనల్ని కాపాడుతాయి. రోజుకు రెండుసార్లు లవంగంతో తయారు చేసిన టీ తాగడం వల్ల కఫం సమస్య నుంచి బయటపడవచ్చు. కఫాన్ని తొలగించుకోవడం కోసం మందులు వాడే బదులు లవంగ టీని తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. రెండు లవంగాలు, చిన్న అల్లం, దాల్చిన చెక్క ముక్క, నీళ్లను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించి చల్లార్చి వడకట్టి తేనే కలుపుకుని తాగాలి. ఈ టీ కఫాన్ని విరిచేస్తుంది. చలికాలంలో రోజుకి రెండుసార్లు ఈ లవంగం టీ తాగితే శరీరానికి ఎంతో మంచిది. కఫంతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.