మ్యాగీ నూడుల్స్‌లో ఆరోగ్యానికి కీడు చేసే పాషాణ పదార్థాలు ఉన్నాయని అప్పట్లో వివాదం చెలరేగింది. ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. తర్వాత ఆ నూడుల్స్ బావున్నాయని సర్టిఫై చేయడంతో మళ్లీ మార్కెట్లోకి వచ్చేశాయి. డాబర్ తేనెపైనా(Dabur honey) ఇలాంటి వివాదం మళ్లీ మొలైంది. దేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే డాబర్ తేనెలో కేన్సర్‌కు దారితీసే కార్సినోజెనిక్(carcinogenic) పదార్థాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కంపెనీ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. తమ తేనె స్వచ్ఛమైందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
‘‘మా తేనె ఏ పరిశ్రమలో తయారైనా ఎఫ్ఎస్ఎస్ఏ ప్రమాణాలు(Food Safety and Standards Authority of India) పాటిస్తాం. ముడి తేనె సేకరించి శుద్ధి చేస్తాం. శుద్ధి, ప్యాకింగ్ వంటి అన్ని దశల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నాం. మా ఉత్పత్తికి ఆగ్ మార్క్ కూడా ఉంది.’’ అని డాబర్ ఇండియా సీఎఫ్ వో అంకుర్ జైన్(Ankur Jain) తెలిపారు. కేన్సర్ పదార్థాలు ఉన్నాయని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గుజరాత్ నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు జరిపిన నాణ్యతా పరీక్షల్లో డాబర్ సహా కొన్నికంపెనీల తేనెలు తేలిపోయినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. తేనెలో హెచ్ఎంఎఫ్(Hydroxymethylfurfural) ) పదార్థం 80 మిల్లీగ్రాములు మాత్రమే ఉండాలని ప్రమాణాలు చెబుతుండగా డాబర్ తేనెలో 176.57 మిల్లీగ్రాములు ఉందని వెల్లడించింది,. శ్రీజీ హనీ బ్రాండులోనూ ఈ పదార్థం 135.16 మిల్లీగ్రాములని తెలిపింది. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రకారం కేజీ తేనెలో హెచ్ఎంఎఫ్ 40 ఎం.జీ. దాటకూడదు. డాబర్ తేనెలో చక్కెర పాకం కలుపుతున్నారని మూడేళ్ల కిందట ఆరోపణలు వచ్చాయి. డాబర్ సహా దేశంలో అమ్ముడవుతున్న 13 కంపెనీలు తేనెలు మిక్స్ చేస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ తెలిపింది.