Smart Phone Children : ఇలా చేస్తే పిల్లలు స్మార్ట్‎ఫోన్ ముట్టనే ముట్టరు

Byline :  Aruna
Update: 2023-12-09 07:44 GMT

స్మార్ట్ ఫోన్‎ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరింట్లో చూసినా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్, ఐపాడ్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. కొందరైతే అవసరానికి మించి రెండు , మూడు ఫోన్లను వాడుతున్నారు. దీంతో పెద్దల నుంచి పిల్లల వరకు పనులెన్ని ఉన్నా పక్కనపెట్టి ఫోన్లకు విపరీతంగా ఎడిక్ట్ అయిపోతున్నారు. అసలు ప్రపంచం ఎటుపోతుందో కూడా పట్టించుకోలేనంతగా వాటికి బానిసలవుతున్నారు. ఇక కొందరు పేరెంట్స్ పిల్లల అల్లరిని తట్టుకోలేక ఫోన్లను ఎరగా వాడుకుంటున్నారు. వారి అల్లరి నుంచి తప్పించుకుంటున్నారు. దీంతో పిల్లలు బయటికి వెళ్లి ఫ్రెండ్స్‎తో ఆడుకోవాలన్న ఆలోచనే మరిచిపోయారు. ఒకేదగ్గర కూర్చొని అరచేతిలో ఫోన్ పట్టుకుని ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఇలా ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోవడంతో చిన్న ఏజ్‎లోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఒబేసిటి సమస్యలు అధికమవుతున్నాయని తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అంతేకాదు ఫోన్‌ లేదా టీవీని గంటల తరబడి చూస్తూ ఎక్కువే తినేస్తున్నారట. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వీటన్నింటి నుంచి పిల్లలను రక్షించాలంటే స్మార్ట్‌ఫోన్‌ వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు.

పెద్దలకు ఇది పెద్ద టాస్క్ :

పిల్లల మనసు అద్దం లాంటిది. ఇంట్లో ఉండే పేరెంట్స్ లేదా ఇతర పెద్దలు ఎలా ఉంటారో , ఏం చేస్తున్నారో గమనించి వాటినే అలవాటు చేసుకుంటారు. కాబట్టి పేరెంట్స్ పిల్లల ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు ఉన్న సమయంలో తల్లిదండ్రులు, పెద్దలూ వీలైనంత వరకు స్మార్ట్‌ఫోన్స్, లాప్‌టాప్స్ చూడడాన్ని అవాయిడ్ చేయండి. ఒక‎వేళ మీ పిల్లలకు ఫోన్‌ చూస్తూ అన్నం తినే అలవాటు ఉంటే ఆ అలవాటును మాన్పించే ప్రయత్నం చేయండి. పిల్లలకు టైంకి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఫోన్ ఇస్తుంటారు పేరెంట్స్ అలా చేయడం వల్ల వారికి ఆహారం రుచి తెలియకపోవడంతో పాటు ఎంత తింటున్నామన్న లిమిట్ కూడా తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి వారికి ఆకలి వేసినప్పుడు మాత్రమే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు పిల్లలు మారాం చేయరు. మొబైల్‌ గురించి ఆలోచించకుండా కామ్‏గా తినేస్తారు. తిండిపైన ధ్యాస కూడా పెరుగుతుంది. ఇది పెద్దలకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మొబైల్‌ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి అన్నం పెట్టడానికి ట్రై చేయండి. ఎలాంటి పేచీ పెట్టకుండా పిల్లలు ఆహారం తినేస్తే , ఈ సమయాన్ని కాస్త పెంచండి. పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లను మాట్లాడించే ప్రయత్నం చేయండి. తినేటప్పుడు ఫుడ్ ఎలా ఉందో తెలుసుకోండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా వారితో గడిపితే పిల్లలకు ఫోన్‌ చూపిస్తూ తినిపించాల్సిన అవసరం ఉండదు.

పిల్లలకు సమయం కేటాయించాలి :

చిన్నప్పటినుంచి పిల్లలకు బుక్స్ చదివే అలవాటును నేర్పించాలి. అలా అని బుక్స్ ముందేసి చదువండి అంటే పిల్లలు చదవరు. వారిని ఆకట్టుకునేందుకు ముందుగా టాయ్ బుక్స్ కొని పెట్టాలి, ఆ తర్వాత పజిల్స్‌ బుక్స్ పరిచయం చేయాలి. అలా కథల పుస్తకాలు ఆ తర్వాత న్యూస్ పేపర్స్ లో పిల్లలకోసం స్పెషల్ గా డిజైన్ చేసిన స్టోరీస్‎ను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్‌ఫోన్‌ పైకి వెళ్లదు. పిల్లలకు చిన్నప్పటి నుంచి చుట్టుపక్కన పిల్లలతో ఆడుకోవటం అలవాటు చేయాలి. ఒకవేళ వారి వయసువారు లేకపోతే మీరే కాస్త సమయం కేటాయించి వారితో ఆడుకోవాలి. కాసేపు ఔట్‌డోర్‌ ఆటలు ఆడితే , కాసేపు చెస్, క్యారమ్స్‌ వంటి ఇన్ డోర్ గేమ్స్ ఆడటం అలవాటు చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా స్మార్ట్‌గా తయారవుతారు.




Tags:    

Similar News