Gandhi Hospital: సంతానం లేని దంపతులకు సర్కార్ శుభవార్త

Update: 2023-10-08 03:40 GMT

సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ హాస్పిటల్ లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని చెప్పారు. ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్‌ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ వెల్లంకి జానకీ తెలిపారు.

పిల్లలు లేని దంపతులు చాలామంది సంతానం కోసం కార్పొరేట్‌ ఆస్పత్రిలో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ.. అప్పులపాలవుతుంటారు. అయితే, ఇటువంటి వారి కోసం ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌) సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నది. 2018లోనే గాంధీలో సంతాన సాఫల్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో వైద్యపరీక్షలు, కౌన్సెలింగ్‌ సేవలు అందుబాటులో ఉండేవి. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో శుద్ధి చేసి భార్య అండాశయంలోకి ప్రవేశపెట్టే విధానంలో కూడా కొంతమందికి చికిత్స అందించారు. ఐయూఐ విధానం ద్వారా.. ఓపీ సేవల నుంచి రక్త పరీక్షలు, స్కానింగ్‌ పరీక్షలు అన్నింటినీ పూర్తి ఉచితంగా అందిస్తున్నది. ఇప్పుడు అధునాతన పరికరాలు, పద్ధతులు ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. ఫెర్టిలిటీ వైద్యం కోసం నగరం నుంచేకాక భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్‌, వరంగల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, బీదర్‌, నాందేడ్‌ ప్రాంతాల నుంచి వస్తున్నారు. రోజూ దాదాపు 20-25మంది వరకు ఫెర్టిలిటీ విభాగానికి వస్తున్నారు.

Tags:    

Similar News