కత్తెరను కడుపులో ఉంచి కుట్లు వేశారు..ఏలూరులో వైద్యుల నిర్వాకం

Update: 2023-08-16 11:37 GMT

వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణం పోసేవాడు ఆ దేవుడైతే ఆ ప్రాణాలను కాపాడేవాడు వైద్యుడని అందరూ వారిని దైవంతో సమానంగా భావిస్తారు. అందుకే అన్ని వృత్తుల్లో కల్లా వైద్య వృత్తి ఉన్నత స్థాయిలో నిలిచింది. అయితే కొంతమంది వైద్యుల మాత్రం ఆ వైద్య వృత్తికే తీవ్ర కలంకం తీసుకువస్తున్నారు. వైద్యులను నమ్మి ప్రజలు తమ ప్రాణాలను వారి చేతిలో పెడితే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారు.

తాజాగా ఏలూరు జిల్లాలో వైద్యుల నిర్వాకానికి ఓ బాలింత నరకయాతన అనుభవించింది. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళితే సర్జరీ చేసి కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేసి మహిళ ప్రాణాల మీదకుతీసుకువచ్చారు.

పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామానికి చెందిన గర్భిని జి.స్వప్న డెలివరీ నిమిత్తం ఏప్రిల్ 19న ఏలూరులోని బోధనాసుపత్రికి వెళ్లింది. ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు వైద్యులు ఆ తరువాత స్వప్నను డిశ్చార్జ్ చేశారు. బిడ్డతో సహా ఇంటికి వెళ్లిన స్వప్నకు తరచుగా కడుపులో నొప్పి వచ్చేది. చాలా సార్లు ఇది సాధారణంగా వచ్చే నొప్పే అనుకుని ఆమెకు తెలిసిన మెడిసిన్ వేసుకునేది. ఈ క్రమంలో ఆగస్టు 8న కడుపునొప్పి తీవ్రంగా రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరికి అదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులకు అర్థం కాక విజయవాడలోని ఆస్పత్రికి ఆమెను సిఫార్సు చేశారు. అక్కడ ఆమెకు ఎక్స్‎రే తీయడంత ఏలూరు వైద్యుల నిర్వాకం బయటపడింది. ఆపరేషన్‎కు వాడిని సర్జికల్ కత్తెరను కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. కడుపులో కత్తెర ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ కోరగా వాస్తవమేనని అంగీకరించారు. దీంతో ఈ దారుణంపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ కూడా స్పందించారు. విచారణ కమిటీని వేశారు.




Tags:    

Similar News