నేటి నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం

Update: 2023-08-17 01:55 GMT

బుధవారం అమావాస్యతో అధికశ్రావణం ముగిసింది. ఇక నేటి నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. పవిత్ర మాసం సందర్భంగా ఆలయాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. ఈ రోజు నుంచి నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలతో ఆల యాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము చంద్రుడు శ్రవణా నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసమునకు శ్రావణమాసమని పేరు వచ్చిందని పండితులు చెబుతుంటారు. శ్రీమన్నారాయణుని యొక్క జన్మ నక్షత్రము శ్రవణా నక్షత్రం. శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినదీ ఇదే మాసం కాబట్టి శ్రావణానికి అంతటి విశిష్టత వచ్చిందని అంటారు.




 


శివకేశవులు అనే భేదము లేకుండగా ఇద్దరినీ పూజించే మాసం శ్రావణమాసమని ప్రతీతి. శ్రావణ మాసంలో కృష్ణావతారము, హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణమాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందంటారు. శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకములో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని చెప్తారు.

శ్రావణమాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశేషం. శ్రావణ బుధవారాలు పాండు రంగ విఠలుడను ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్ర నామము వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములున్నారు. అష్ట లక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియచేశాయి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మానవుల జీవితములో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని నుంచి బయటకు రావడానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం లేదని పండితులు తెలిపారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం మన సంప్రదాయంగా వస్తోంది.ఈ విధముగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుడిని ఆరాధించి సత్ఫలితాలు పొందవచ్చని అంటారు.




 




 



Tags:    

Similar News