Shankarabaranam:‘శంకరా నాదశరీరా పరా'... తరగతి గదిలో అద్భుతంగా ఆలపించిన చిన్నారులు

చిన్నారుల పాటకు తెలంగాణ పోలీసులు ఫిదా

By :  Kiran
Update: 2024-02-19 01:52 GMT



అప్పుడెప్పుడో 80's లో వచ్చిన ఓ క్లాసిక్ సినిమా పాటను.. అద్భుతంగా ఆలపించాడు ఈ తరానికి చెందిన ఓ బాలుడు. ఆ పాటకు తగ్గట్టుగా మరో చిన్నారి సంగీతాన్ని ధ్వనింపజేశాడు. ఇదంతా ఓ తరగతి గదిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ చిన్నారుల టాలెంట్ కు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

సినీ దర్శకుడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన 'శంకరాభరణం’ చిత్రం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. సంగీత ప్రధానమైన ఆ సినిమాలోని అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఆ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా’ ఆ రోజుల్లో అందరినీ అలరించింది. నేటితరం వారు కూడా ఆ పాటను సరదాగా వింటూ , పాడుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

తాజాగా.. ఓ స్కూల్లో ఓ బాలుడు పాడిన అదే పాట సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఓ విద్యార్థి పాడుతుండగా.. మ‌రో విద్యార్థి స్కూల్ బెంచ్‌, కంపాస్ బాక్స్‌పై సంగీతం ధ్వ‌నింప‌జేశాడు. ఇక ఆ గాత్రానికి త‌గ్గ‌ట్టుగా, సంగీతం ధ్వ‌నింప‌జేయ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్‌ శాఖ ఆ వీడియోను ట్యాగ్‌ చేస్తూ పిల్లల ప్రతిభను ట్విటర్‌ వేదికగా ప్రశంసించింది. ‘మన దేశంలో బాలలు/ యువ ప్రతిభకు కొదవలేదు.. తెలుసుకోవాల్సింది మంచి చెడుల మధ్య ఉండే సన్నని గీత మాత్రమే. అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి ఆవిష్కరణలకు నిలయంగా అవుతుంది’ అని ట్వీట్‌ చేసింది. పిల్లల ప్రతిభ పై నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.



Tags:    

Similar News