ప్రభుత్వ వ్యవస్థలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. విజయవాడలో జరిగిన ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన జగన్.. ఏపీ ఎన్జీవో సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఒక డీఏను దసరా కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ ఇస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగులు అడిగినవన్నీ ఇవ్వకలేకపోయినా.. ప్రభుత్వం తమదేనని ఉద్యోగులు భావించాలని కోరారు. జీపీఎస్ (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్)పై త్వరలో ఆర్డినెన్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై భారం పడకుండా, ఉద్యోగులకు నష్టం జరగకుండా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. 2019 నుంచి ఇప్పటి వరకు 3.19 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగాలిచ్చామని, 2.06 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు.