Weather Updates : వాతావరణ శాఖ హెచ్చరిక..ఏపీలో నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

Update: 2023-05-31 03:12 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు శాంతించాడు. ఇన్నాళ్లు ఎండ వేడిమి, వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు వాతావరణం చల్లగా మారడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం కూడా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని సంస్థ తెలిపింది.

ఇక కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో బుధవారం తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఎండ ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ప్రజలు ఆకస్మిక వర్షాలు, పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

మంగళవారం ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. ఒంగోలు, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో కురిసిన కుండపోత వానలకు నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతు నీరు రహదారులపై చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక వాహనదారుల అవస్థలు వర్ణణాతీయం. బుధవారం కూడా ఇదే స్థాయిలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News