డెన్మార్క్‌కు చెందిన పీటర్ వాన్ టాంజెన్ బుస్కోన్ ముక్కులో ఏకంగా 68 అగ్గి పుల్లలు దూర్చుకుని అరుదైన రికార్డు నెలకొల్పాడు. గిన్నిస్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం, ముక్కులో కనీసం 54 పుల్లలు దూర్చుకుంటే ఈ రికార్డుకు అర్హులు. ముక్కులో అత్యధిక సంఖ్యలో అగ్గి పుల్లలు దూర్చుకున్న తొలి వ్యక్తిగా పీటర్ రికార్డు నెలకొల్పాడని, ఈ మేరకు గిన్నిస్ రికార్డు ఓ ప్రకటన చేసింది. కాగా, తనకీ అసాధారణ రికార్డు దక్కడంపై పీటర్ హర్షం వ్యక్తం చేశాడు. అన్ని పుల్లలు దూర్చుకున్నా పెద్దగా నొప్పి కలగలేదని తెలిపాడు.
తన ముక్కుపుటాలు పెద్దవిగా ఉంటాయని, బాగా సాగుతాయని వెల్లడించాడు. ఇలాంటి రికార్డు కోసం ప్రయత్నించాలన్న ఆలోచన అనునకోకుండా కలిగిందని అతడు చెప్పాడు. ఇలాంటి ఆలోచన గతంలో ఎన్నడూ రాలేదని, చిన్నతనంలోనూ ఇలాంటి పనులు చేసినట్టు గుర్తులేదని చెప్పుకొచ్చాడు. తన రికార్డును తానే భవిష్యత్తులో అధిగమించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పీటర్ తెలిపాడు. ఇందుకోసం కొంత ట్రెయినింగ్ అవసరం పడొచ్చని అతడు అభిప్రాయపడ్డారు. వయసు పెరిగే కొద్దీ ముక్కు కూడా పెద్దదవుతుంది కాబట్టి మరో రికార్డు నెలకొల్పే ఛాన్స్ ఉందని తెలిపాడు. ఈ రికార్డు జనాలను కొత్త ప్రయత్నాలవైపు ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. లైఫ్‌లో ఆశ్వాదించేందుకు ఎంతో ఉందని వెల్లడించాడు.