అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా ఓ అద్భుత సరస్సును గుర్తించింది. ఈ మధ్యనే అమెరికాలోని డెత్ వ్యాలీలో ఓ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. ఆ సరస్సుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను నాసా విడుదల చేసింది. ఆ సరస్సు ఏర్పడటానికి ముందు అక్కడి పరిస్థితి నాసా తెలిపింది. నాసా ఎర్త్ అబ్జర్వేటరీ ప్రకారంగా హిల్లరీ హరికేన్ తర్వాత 2023లో ఆ తాత్కాలిక సరస్సు ఏర్పాటైంది. అయితే అది క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ప్రస్తుతం 2024 ఫిబ్రవరికి ఆ సరస్సు పూర్తిగా నిండిపోయి కనిపిస్తోందని నాసా వెల్లడించింది.
తుఫాను కారణంగా డెత్ వ్యాలీలో ఆ సరస్సు నిండుగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో తుఫాన్ కారణంగా వరద ఉధృతి పెరిగింది. దీంతో సరస్సు పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం నీలం రంగు నీటితో కొన్ని కిలోమీటర్ల పొడవునా ఈ సరస్సు కనిపిస్తోంది. భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. దీనిని ఉత్తర అమెరికాలో అత్యంత పొడి ప్రదేశం అని పిలుస్తుంటారు. వర్షం కూడా చాలా తక్కువగానే పడుతుంది. అయితే గత ఆరు నెలల్లో రెండింతల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
కొత్తగా ఏర్పడిన సరస్సు పెరుగుతూ వస్తోందని, 2023 ఆగస్టు నెల నుంచి 2024 ఫిబ్రవరి నెల వరకూ ఆ సరస్సు పరిమాణం బాగా పెరిగినట్లు శాటిలైట్ ఫోటోల్లో తెలుస్తోంది. ఈ సరస్సు ఎంత కాలం ఉంటుందో స్పష్టంగా చెప్పలేమని, గత ఏడాది అక్టోబర్ నాటికి సరస్సు పూర్తిగా అదృశ్యమవుతుందని భావించినప్పటికీ ఇది మరింత విస్తరిస్తోందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి తాత్కాలికంగా ఏర్పడిన ఈ అరుదైన సరస్సు ఓ పర్యాటక ప్రాంతంగా కూడా మారే అవకాశం ఉందని నాసా అధికారులు భావిస్తున్నారు.
This temporary lake in Death Valley is extending its stay.
— NASA Earth (@NASAEarth) February 16, 2024
Rain from a potent atmospheric river filled up the Badwater Basin this month. These enhanced-color #Landsat images show a shallow lake several kilometers across, with water emphasized in blue. https://t.co/YXeTZT6oGG pic.twitter.com/h5vVfpQSjU