రామా.. ఇదేమి దోపిడి.. అయోధ్యలో ఏది కొనాలన్నా దేవుడు కనిపిస్తున్నడు
దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న భారతీయుల కల చివరికి సాకారం అయింది. అయోధ్యలో బాలక్ రామ్ కొలువుదీరాడు. జనవరి 23 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నాడు. దీంతో దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు రామయ్య దర్శనం కోసం అయోధ్యకు తరలివెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లన్నీ భక్తలతో నిండిపోయున్నాయి. అదే అదునుగా చేసుకున్న వ్యాపారులు.. రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. రేట్లు పెంచేసి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అయోధ్య ప్రస్తుతం చలి విపరీతంగా పెరిగిపోయింది. రోజూ 10 డిగ్రీలకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి నుంచి ఉపశమనం పొందేందుకు.. టీ తాగుతున్నారు. తిన్నా తినకపోయినా టీ ఉంటే చాలంన్నట్లు.. హోటల్స్ కు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్యలో టీ దందా పెరిగిపోయింది. ఈ క్రమంలో హోటల్ యజమానులు భక్తులకు షాకిచ్చారు.
అయోధ్య ఆలయానికి సమీపంలో ఉన్న హోటల్స్ లో కప్పు టీ రూ.55 కు అమ్ముతున్నారు. అదే టోస్ట్ వైట్ టీ అయితే రూ.66 కు విక్రయిస్తున్నారు. దీనిపై మండిపడుతున్న భక్తులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. కప్పు రూ.55కు అమ్మడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రూ.10 నుంచి రూ. 20 ఉండే టీ.. రూ.60 అమ్మడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ రాజ్యంలో ధరల దోపిడిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆలయ సమీపంలోని శబరి కిచెన్ అనే హోటల్ లో టీ తాగడానికి వెళ్లిన ఓ కస్టమర్ కు హోటల్ షాకిచ్చింది. తీరా టీ తాగాక జీఎస్టీలన్నీ కలిపి 4 టీలకు రూ.240 బిల్లేసింది. దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. రంగంలోకి దిగిన అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ.. శబరి హోటల్ కు నోటీసులు ఇచ్చింది.