వేతనాలు పెంచాలంటే ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిపై ఎస్మా ప్రయోగించిన అక్కడి ప్రభుత్వం విధుల్లో చేరనివారిని తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విస్సన్నపేట జాతీయ రహదారిపై సీఐటీయూ కార్యకర్తలతో కలిసి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అంగన్వాడీలను అక్కడి నుంచి పంపించేందుకు మహిళా కానిస్టేబుళ్లు ప్రయత్నించగా.. వారిపై అంగన్వాడీలు తిరగబడ్డారు. మహిళా కానిస్టేబుళ్లను అక్కడి నుంచి దూరంగా నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొంతసేపు గాంభీర వాతావరణం నెలకొంది. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు చివరికి అంగన్వాడీలను అక్కడి నుంచి పంపించివేశారు.
కాగా వేతనాలు పెంచాలంటూ గత కొంతకాలంగా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని వారిపై వేటు వేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల అంగవ్వాడీలపై వేటు వేశారు. మన్యం జిల్లా, విజయవాడ జిల్లాలో వర్కర్లు, హెల్పర్లను తొలిగిస్తూ కలెక్టరులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్ వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబడ్డారు. అంతేకాదు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.