Sharmila : సీఎం జగన్వి కనిపించని పొత్తులు.. షర్మిల ఆరోపణలు

Byline :  Vijay Kumar
Update: 2024-01-24 11:05 GMT

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆమె డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. జగన్ పాలనలో ఏపీ ఆగమైందని విమర్శిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. చంద్రబాబువి కనిపించే పొత్తులైతే జగన్ మోహన్ రెడ్డివి మాత్రం కనిపించని పొత్తులు అంటూ ఫైర్ అయ్యారు. తమ పార్టీకి 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి..అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాన్ని మరిచిపోయారని ఆరోపించారు. ఉత్తరాంధ్రను టీడీపీ, వైసీపీ పార్టీలు ఘోరంగా మోసం చేశాయని అని అన్నారు. విశాఖకు కనీసం ఓ రైల్వే జోన్ ను కూడా తేలేకపోయారని అన్నారు.

గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పన్నంగా అదానీకి ఇచ్చారన్న షర్మిల.. విశాఖ ఉక్కు కర్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి స్టీల్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. బీజేపీ తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీలను ఓడగొట్టాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. కాగా ఈ నెల 21న విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం అహర్నిషలు కృషి చేస్తానని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల అన్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి కాంగ్రెస్ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. 

Tags:    

Similar News