ఏపీ పోలీసులపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసుల దాడిపై ఆమె స్పందించారు. పోలీసులా లేక వైసీపీ గూండాలా అంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా ? అంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా అని ప్రశ్నించారు. వైసీపీ గూండాలను పక్కన పెట్టుకొని తమ కార్యకర్తలపై మరి దాడులు చేశారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా కొట్టడానికి పోలీసులకు ఎవరిచ్చారు హక్కు అంటూ మండిపడ్డారు. కండువా లేని వైసీపీ కార్యకర్తలు పోలీసులు అంటూ ధ్వజమెత్తారు. ఈ ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని, విచక్షణారహితంగా కొట్టిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.