Sharmila : ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు.. షర్మిల ఏన్నారంటే?
ఏపీ రాజకీయాల్లో పొత్తలపర్వం నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరగా.. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల కోసం సీట్ల షేరింగ్ అంశాన్ని కూడా పూర్తి చేశాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఏపీకి చెందిన సీపీఎం కార్యదర్శి , సీపీఐ కార్యదర్శి రామకృష్ణ శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పొత్తుకు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పొత్తు నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకం వంటి అంశాల గురించి కూడా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా భేటీ అనంతరం ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
తమ ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు అంశంపై చర్చించామని అన్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యమని అన్నారు. ఇక ఉమ్మడి కార్యాచరణ, సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని అధికార , ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నా.. విభజన హామీలు నెరవేరాలన్నా.. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల అన్నారు.
ఇక సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీకీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భయపడుతున్నారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో తాము పని చేస్తామని అన్నారు. ఏపీలో లెఫ్ట్, ప్రజాతంత్ర పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తామని అన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ ఏపీకి అన్యాయం చేశాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయిందని అన్నారు. అలాగే చెరో దఫా అధికారంలో ఉన్న చంద్రబాబు, జగన్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ఏం చేయలేదని, పైగా రాష్ట్రానికి మోసం చేసిన బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు.