Chandrababu Naidu : తారకరత్న చనిపోయి నేటికి ఏడాది.. ఎమోషనలైన చంద్రబాబు
ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తారకరత్నచనిపోయి నేటికి ఏడాది అవుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిన తారకరత్న బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇవాళ తారకరత్న ప్రథమ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. తారకరత్న తమను వదిలి వెళ్లి ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు. "ప్రథమ వర్థంతి వేళ తారకరత్నను స్మరించుకుంటున్నాం. చాలా చిన్న వయసులోనే మాకు దూరమయ్యాడు. తారకరత్న వదిలి వెళ్లిన జ్ఞాపకాలే మాకు ఓదార్పు. ఆ జ్ఞాపకాలను మేం పదిలంగా దాచుకుంటాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తారకరత్న మమ్మల్ని వదిలి వెళ్లి అప్పుడే ఏడాది అయిందా అంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. తాను వదిలి వెళ్లిన మధురమైన జ్ఞాపకాలు తనని తమ మనసుల్లో సజీవంగా ఉంచుతున్నాయని అన్నారు. "ప్రియమైన సోదరుడా.. నిన్ను మేం ఎంతగానో మిస్సవుతున్నాం" అంటూ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
కాగా గతేడాది ఫిబ్రవరి 27న కుప్పంలో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న హటాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనకు మొదట కుప్పం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి, ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయింది. బ్రెయిన్ కు ఆక్సీజన్ అందక పోవడం వల్ల సమస్యలొచ్చాయి. మొదటి రోజు నుంచి తారక రత్న కోమాలోనే ఉన్నారు. నారాయణ హృదయాలయ వైద్యులతో పాటు విదేశాల నుంచి వచ్చిన వైద్యులు కూడా తారక రత్నను బతికించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అందులో వారు విజయం సాధించలేకపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న కొద్ది సేపటిక్రితం కన్నుమూశారు.