Janardhan Reddy : సొంత డబ్బుతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో తమ సొంత ట్రస్ట్ ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఆదివారం ఆయన ప్రాంరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలను తానే పునర్నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటానన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు.
కాగా మర్రి జనార్ధన్ రెడ్డి 2012లో తెలుగుదేశం పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుల్ల దామోదర్ రెడ్డి పై 14,435 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి పై 54,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కూచుళ్ల రాజేశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.