Pawan Bhimavaram Tour : పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా.. అదే కారణం!
జనసేన అధ్యకుడు పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ పర్యటనకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో పవన్ కల్యాణ్ ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారని అన్నారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్ళు ఉన్నట్లు అర్ధమవుతోందని అన్నారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉన్నాయని అన్నారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బీ అధికారులతో అనుమతుల విషయంలో మెలికలుపెట్టిస్తున్నారని తెలిపారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. పర్యటన తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని జనసేన తెలిపారు.