ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తన అపాయింట్మెంట్ కోసం 22 సార్లు ప్రయత్నించారని అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడి 12 కేసులు నమోదు చేసుకుంటేనే టీడీపీ కార్యకర్తలకు తన అపాయింట్మెంట్ ఇస్తానని లోకేశ్ అన్నారని పాల్ చెప్పారు. నారా లోకేశ్ అపాయింట్మెంట్ ఎవరికి కావాలంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు. లోకేశ్ తండ్రి చంద్రబాబుకే తాను అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అలాంటిది లోకేశ్ ఎంత అని అన్నారు. చంద్రబాబు తన అపాయింట్మెంట్ కోసం తన ముందు 22 సార్లు నిలబడ్డారని అన్నారు.
బుద్ధి ఉన్నోడెవడూ లోకేశ్ అపాయింట్మెంట్ కావాలనుకోరని, ఆ పార్టీలో ఉండాలనుకోరని పాల్ అన్నారు. కేవలం 25 సీట్ల కోసం జనసేన నేతలు కుక్కల్లాగా టీడీపీకి అమ్ముడు పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్, చంద్రబాబు, పవన్ బీజేపీకి తొత్తుల్లాగా మారారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీతో ఈ మూడు పార్టీల నేతలు అంటకాగుతున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని కేఏ పాల్ స్పష్టం చేశారు.