ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) విజయవాడకు చేరుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ .. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. ఎంత మంది పీకేలు వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోలేరని అన్నారు. అయినా ప్రశాంత్ కిశోర్ మెదడులోని గుజ్జంతా అయిపోయిందని, ఇప్పుడు తాను చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని కొడాలి అన్నారు. ఇండియా కూటమిలో చేరమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పంపితే ఒక ప్రశాంత్ కిశోర్ (పీకే) ఏపీకి వచ్చారని అన్నారు. ఇక మరో పీకే (పవన్ కల్యాణ్) చంద్రబాబును బీజేపీతో దోస్తీ కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇద్దరి పీకేలతో రెండు కూటములకు దగ్గరగా మెసలుతూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిశోర్ తమ వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుంచి వచ్చాడు.. ఏం చేస్తాడు అంటూ చంద్రబాబకు అన్నారని, మరీ ఇప్పుడు అదే పీకే తననెందుకు కలిశాడో చెప్పాలని కొడాలి నాని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయమై అంతకు ముందు స్పందించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు 'మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రీ మాత్రం ఏం చేయగలడు' అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ వేదికగా సైటెర్లు వేశారు.