ఉప్పు, కారం కలిపి లోకేశ్ కోసం పప్పు తీసుకొచ్చా.. మంత్రి అమర్నాథ్ సెటైర్లు
మంత్రి గుడివాడ అమర్నాథ్ అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన ఆరోపణలకు మంత్రి అమర్నాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నారా లోకేశ్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లోకేశ్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. లోకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఆయన కోసం పప్పు తీసుకొచ్చానని సెటైర్లు వేశారు. లోకేశ్ కు కేవలం ముద్దుపప్పు అయితే సరిపోదని, అందుకే పప్పుతో పాటు ఉప్పు కారం కూడా కలుపుకొచ్చానని ఎద్దేవా చేశారు. లోకేశ్ ఎంతగానో ఇష్టపడేటువంటి పప్పును కుమ్మరి సోదరులు తయారు చేసిన మట్టి కుండలో తీసుకొచ్చానని అన్నారు. దయచేసి తాను తీసుకొచ్చిన ఈ ఐటెంను ఎవరైనా లోకేశ్ కు ఇవ్వాలని అన్నారు. లేదంటే లోకేశ్ కు ఇష్టమైన ఐటెం కాబట్టి ఆయననే పరుగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్లాలని వ్యంగాస్త్రాలు సంధించారు.
టీడీపీ అధికారంలోకి రావడానికి అనేకసార్లు సహకరించిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏనాడు న్యాయం చేయని తండ్రీకొడుకులు తాజాగా ఈ ప్రాంతంపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు. ఏమాత్రం సిగ్గు, లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేశ్ అని అన్నారు. వాళ్లలో కొంత రేషాన్ని పెంచడానికి ఉప్పు, కారం కలుపుకొచ్చానని అన్నారు. తాను లోకేశ్ లా బ్యాక్ డోర్ నుంచి రాజకీయాల్లోకి రాలేదని, 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ అండతో మంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు. 420 గాళ్లను పక్కనపెట్టుకొని 420 గాడిలా లోకేశ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశామని అన్నారు. రెడ్ బుక్ లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేశ్ కు రాదని, ఎర్ర బుక్ ను మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారో లోకేశ్ ఇష్టం అని అన్నారు.