Minister Roja : పోయి మనవడితో ఆడుకోండి.. చంద్రబాబుపై మంత్రి రోజా సెటైర్లు
అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో దమ్ముంటే తనతో చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాలు విసిరారు. కాగా చంద్రబాబు సవాలుకు ఏపీ మంత్రి రోజా స్పందించారు. వందలాది హామీలిచ్చి మ్యానిఫెస్టోను చంకలో దాచేసే మీకు ఈ ఛాలెంజులు ఎందుకు అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. "మీలాంటి మోసగాడిని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ. ఇక మీ సేవలు చాలించండి.పోయి మనవడితో ఆడుకోండి" అంటూ రోజా ట్విట్టర్ వేదికగా చంద్రబాబకు కౌంటర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించే వ్యక్తే లేరన్న రోజా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసిన వ్యక్తి జగన్ అని మాజీ సీఎం చంద్రబాబు ఆదివారం విమర్శలు గుప్పించారు. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ప్రభుత్వానికి కౌంట్ డైన్ ప్రారంభమైందన్న చంద్రబాబు.. ఇంకా 50 రోజులైతే వైసీపీ ప్రభుత్వం పోతుందని అన్నారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని, వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్ కు పడుతుందని అన్నారు. "బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం.. నువ్వే చెప్పు.ఎక్కడికైనా వస్తా.. దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ!" అంటూ చంద్రబాబు సవాలు విసిరారు. ఆయన ఈ సవాలుకు తాజాగా రోజా కౌంటర్ ఇచ్చారు.