సీఎం జగన్కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఇటీవలే మంగళగిరి ఎమ్మెల్యే పార్టీని వీడగా.. అదే బాటలో మరో ఎమ్మెల్యే పయనించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. సీఎం జగన్ను కలిసేందుకు ఆయన తాడేపల్లికి రాగా.. అపాయింట్మెంట్ లభించలేదు. ఈ క్రమంలోనే తనకు టికెట్ ఇవ్వడంలేదని సజ్జల చెప్పారని రామచంద్రారెడ్డి తెలిపారు. జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వచ్చానన్న ఆయన.. పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించినట్లు చెప్పారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు.
జగన్ చెప్పిన అన్ని పనులను చేశానని.. కానీ సర్వేల పేరు చెప్పి టికెట్ ఇవ్వకపోవడం బాధగా ఉందని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. జగన్ను సర్వస్వం అనుకుని తమ జీవితాలను సర్వనాశనం చేసుకున్నామని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీని వీడుతున్నట్లు రామచంద్రారెడ్డి ప్రకటించారు. కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.