మంత్రి పొంగులేటిని కలిసిన షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం
రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షర్మిల కలిశారు. ఆదివారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన షర్మిల.. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని కోరుతూ పొంగులేటికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. కాగా ఇప్పటికే తన కుమారుడి పెళ్లికి రావాలని కోరుతూ ఏపీ సీఎం, తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షర్మిల ఇన్విటేషన్ ఇచ్చారు. కాగా ఈ నెల 4న వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్, ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం తనకు ఏ పదవి ఇచ్చినా పని చేస్తానని షర్మిల అన్నారు. అయితే ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పే ఛాన్స్ ఉందని, రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో స్పష్టత రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.