Prajapalana Application : ప్రజాపాలన కార్యక్రమానికి బ్రేక్.. 3 రోజుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆరు గ్యారెంటీ పథకాల కోసం 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా 18 లక్షలకు పైగా అప్లికేషన్లు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు చెందినవి 15 లక్షల 88 వేల 720 కాగా ఇతర అంశాలకు సంబంధించినవి 2 లక్షల 40 వేల 387 ఉన్నాయి. ఇప్పటి వరకు 3 వేల 868 పంచాయతీలు, 8 వేల 697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇవాళ, రేపు ప్రభుత్వ సెలవుల కారణంగా ప్రజా పాలన సదస్సులకు విరామం ఇచ్చారు. జనవరి 2 నుంచి 6 వరకు తిరిగి సదస్సులు జరగనున్నాయి. గ్రేటర్‌లో అభయ హస్తం గ్యారంటీలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల్లో దాదాపు 10 లక్షల అప్లికేషన్లు అందాయి. ఎల్బీ నగర్ జోన్‌లో 53 వేలు, చార్మినార్‌లో లక్షా 17 వేలు, ఖైరతాబాద్‌లో 74 వేలు, కూకట్‌పల్లిలో 67 వేలు, శేరిలింగంపల్లిలో 38 వేలు, సికింద్రాబాద్‌లో 64 వేలు, కంటోన్మెంట్‌లో 7 వేల దరఖాస్తులు అందాయి.
ఇదిలాఉంటే, శనివారం రోజున సచివాలయంలో ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో నుంచి వస్తున్న స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని.. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే ఈ రెండు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.