KTR : 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఉంటే.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-31 08:32 GMT

తెలంగాణ అంసెబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్నికల తర్వాత తనకు చాలా ఆసక్తికరమైన ఫీడ్‌బ్యాక్, పరిశీలనలు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే తనకు ఇప్పటివరకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లలో ఇదే ఉత్తమమైనదని పేర్కొన్నారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు(32 YouTube Channels) పెట్టుకుంటే బాగుండేదంటూ ఎవరో ఓ సూచన చేశారన్నారు. ఆ కామెంట్స్‌ను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ఆయనపై వస్తున్న తప్పుడు వార్తలను ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని, ఈ ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. "32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని ఉంటే అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేది’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు అవును అన్న నిజమే? అభివృద్ధి చేస్తే ఎవరికీ నచ్చదు.. కేవలం ప్రచారమే కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ఇన్ని రోజులు మీరు చేసింది అదే, చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అంటూ కేటీఆర్ ట్వీట్ పై సెటైర్లు వేస్తున్నారు.

కాగా డిసెంబర్ వెలుడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనకు ముగింపుపడింది. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన కేసీఆర్ ఆశ నెరవేరలేదు. ఈ ఎన్నికల్లో మిత్రపక్షం సీపీఐతో కలిసి కాంగ్రెస్ పార్టీ 65 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 88 స్థానాల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ పార్టీ ఈ సారి 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 8 స్థానాల్లో గెలవగా.. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది.




Tags:    

Similar News