Central Election Commission : తెలంగాణలో ఉపఎన్నిక.. కసరత్తు ప్రారంభించిన ఈసీ
నల్లగొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం లేఖ రాశారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల జనగామ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. డిసెంబరు 30న ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో అధికారికంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికకు నల్గొండ అదనపు కలెక్టరు జే.శ్రీనివాస్ ఓటరు నమోదు అధికారిగా వ్యవహరిస్తుండగా.. నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉండనున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి నల్గొండ కలెక్టరేట్‌లోనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.
ఈ ఏడాది నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తయి మూడేండ్లు నిండిన వారందరూ ఓటు వేసేందుకు అర్హులుగా పేర్కొన్నది ఎన్నికల సంఘం. వారి దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 21న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై మార్చి 14 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితా పూర్తి చేయాల్సి ఉన్నది. అనంతరం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. జూన్ 8వరకు ఉప ఎన్నిక పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. 2021 మార్చిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. 2027 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉంది. ఫిబ్రవరి నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడి మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేయగా.. బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, టీజెఎస్ నుంచి కోదండరామ్, యువ తెలంగాణ తరఫున రాణి రుద్రమదేవి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌కుమార్) తదితరులు బరిలో నిలిచారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందగా.. తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గతంలో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరడంతో ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఆయనే బరిలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసింది