Talasani Srinivas Yadav : కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి - తలసాని
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో తలసాని సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ సహకరిస్తుందని అన్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని వాటన్నింటినీ నివృతిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అభయహస్తం దరఖాస్తులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగినన్ని అందుబాటులో ఉంచాలని తలసాని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అమలు చేయకుండా కాలయాపన చేయాలని చూస్తున్నదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. హామీలను అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు.