Ration Card E-KYC : రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జనవరి 31 లాస్ట్ డేట్
కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ రేషన్ అందిస్తోంది. 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన' అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేపడుతోంది ప్రభుత్వం. సబ్సిడీ రేషన్‌తో పాటు సంక్షేమ పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. అయితే.. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గురించిన కేంద్రం ఆధార్ నంబర్‌తో లింక్ (ఈ కేవైసీ) చేయాలని చెబుతోంది. రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేయడానికి ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగించారు. తాజాగా ఆ గడవును జనవరి 31, 2024 వరకు పొడిగించారు.
రేషన్ కార్డు ఉన్న వారు జనవరి 31 లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ లింక్ చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, ఐరీష్(కంటిపాప) గుర్తింపును తీసుకుంటున్నారు. ఎవరైనా ఆధార్ లింక్ చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిందని అధికారులు సూచిస్తున్నారు.
రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి దాన్ని రద్దు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వ డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలిగిపోతాయి. దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోతాయి. రేషన్ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ కేవైసీని పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 30 నాటికి ఈ ప్రక్రియ 70.80 శాతం ఈ కేవీసీ పూర్తయిందని అధికారులు తెలిపారు.