Upender Reddy : అనితారెడ్డి ఫిర్యాదుతో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ కేసు

Byline :  Bharath
Update: 2024-01-01 05:51 GMT

బీఆర్ఎస్ పార్టీ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. షేక్ పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో ఉపేందర్ రెడ్డిపై కేసు పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3, ప్లాట్‌ నంబరు 8-సీ పేరుతో ఉన్న 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ఉపేందర్ రెడ్డితో పాటు పలువురు కబ్జా చేశారు. ఆ స్థలంలో ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థలో నిర్మాణాలు చేపట్టారు. గతంలో ప్లాట్ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్ రెడ్డి.. ఇప్పుడు ప్లాట్‌ నంబరు 8-సీ తనదిగా చెప్తున్నారు.

కాగా శనివారం తహసీల్దార్ అనితారెడ్డి ఆ స్థలాన్ని పరిశీలించగా.. ప్రభుత్వం భూమి బోర్డ్ తొలగించి, షెడ్లు నిర్మించి వైన్ షాపులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల సహకారంతో అనితారెడ్డి.. ఆ అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు... ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471; సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ చట్టం కింద ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News