Wedding Led to Divorce:పెళ్లైన ఐదు గంటలకే విడాకులు.. ఎందుకో తెలుసా..
పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో జరిగే ఈ వేడుక కోసం వధూవరులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పెళ్లిపనులు మొదలైన నాటి నుండి కళ్యాణ ఘడియ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్‍తో ఉంటారు. అయితే ఇటీవల కాలంలో పెళ్లి పీటల మీదే కొన్ని పెటాకులు అవుతున్నాయి. తాజాగా ఔరంగాబాద్ లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంట..పెళ్లిలో తలెత్తిన చిన్న గొడవ కారణంగా గంటల వ్యవధిలోనే వేరు అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన పెళ్లి బృందం ఔరంగాబాద్‌కు వచ్చింది. రాత్రి 8 గంటలకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వచ్చిన మగపెళ్లి వారికి వధువు తరఫు వారు ఘన స్వాగతం పలికారు. అతిథి సత్కారాలన్నీ చేశారు. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటలకు వరుడి అమ్మమ్మ కుర్చీలో కూర్చుని ఉంది. ఇంతలో ఆడ పెళ్లివారి తరఫు బంధువు ఒకరు ఆమెను కుర్చీలోంచి లేపారు.
ఈ విషయం తెలుసుకున్న పెళ్లికొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. తీవ్ర దూషణలతో గొడవ కాస్తా ఘర్షణగా మారింది. ఘటనతో అవాక్కైన వధువు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది. సమాచారం అందుకున్న మాజీ చైర్మన్ అక్తర్ మేవతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. రాత్రి ఎనిమిది గంటలకు వివాహం జరగగా అదే రాత్రి ఒంటి గంటకు విడాకులు తీసుకోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.