పైలట్ నిర్వాకం.. కాక్పిట్లోకి గర్ల్ ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Thumb : ఫ్లైట్ కాక్పిట్లోకి పైలట్ గర్ల్ ఫ్రెండ్..
అది ఎయిరిండియా విమానం.. విమానం గాల్లో ఎగురుతోంది. ప్రయాణికుల మధ్యలో పైలట్ ఫ్రెండ్ ఉంది. దీంతో ఆమెను కాక్పిట్లోకి పిలిచారు. అక్కడే కాసేపు ఆమెతో ముచ్చటించారు. గతవారం ఢిల్లీ నుంచి లేహ్ వెళ్లిన ఎయిరిండియా ఏఐ-445 విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి నిబంధనలకు విరుద్ధంగా పైలట్ తన ఫ్రెండ్ను కాక్‌పిట్‌లోకి ఆహ్వానించారు.
క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎయిరిండియా కఠిన చర్యలు తీసుకుంది. పైలట్, కో పైలట్ను విధుల నుంచి తప్పించింది. అంతేకాకుండా ఘటనపై దర్యాప్తుకు ఓ కమిటీని వేసింది. ఈ ఘటనపై డీజీసీఏ కూడా స్పందించింది. ‘‘మా దృష్టికి ఈ విషయం వచ్చింది. నిబంధనలకు అనుగుణంగా ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఓ అధికారి చెప్పారు.
ఫిబ్రవరిలోనూ ఓ ఎయిరిండియా విమానంలో ఇటువంటి ఘటనే జరిగింది. దుబాయి నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో పైలట్ తన ఫ్రెండ్ను కాక్‌పిట్‌లోకి ఆహ్వానించడమే గాక.. దాదాపు మూడు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. అంతేగాక.. ఆమెకు సకల మర్యాదలు చేయాలని, భోజనం కూడా ఏర్పాటు చేయాలని విమాన సిబ్బందిని ఆదేశించాడు. ఈ ఘటనపై క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంది. ఆ పైలట్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఎయిరిండియాకు రూ.30లక్షల జరిమానా విధించింది.